Wednesday, November 16, 2011

మనసెప్పుడూ ఇంతే...
 

ఈ మనసెప్పుడూ ఇంతే...
ఇచ్చేదాకా
 ఏడుస్తుంది!
ఇచ్చేశాక..
 ఏడిపిస్తుంది!!

----భాస్కరభట్ల

Wednesday, November 2, 2011

మనసులో బాధ..

మనసులో బాధ..
నీకు చెప్పుకుందామంటే
గొంతు మూగబోయింది!
కనీసం...
కన్నీళ్ళకైనా
మాటలొస్తే
బాగుణ్ణు!!!

-----భాస్కరభట్ల

Friday, October 7, 2011

వెన్నెల మరకలు !!!పైనుంచి
ఎవరో
పాలగిన్నె
ఒంపేసినట్టు...
నేలమీద
ఎన్ని వెన్నెల మరకలో!!!

-------భాస్కరభట్ల

Monday, September 5, 2011

వెక్కిరిస్తోంది....


ఊరెళ్ళిన
మా ఆవిడని
పదే పదే గుర్తుచేస్తూ
వెక్కిరిస్తోంది....
అద్దంమీద బొట్టుబిళ్ళ!!!

----భాస్కరభట్ల

Friday, July 29, 2011

పలికిస్తున్నాను!!!నీ కోసం
చూపుల పియానోపై
నిరీక్షణరాగాల్ని
పలికిస్తున్నాను!!!

----భాస్కరభట్ల

Saturday, July 16, 2011

విశ్రాంతి తీసుకుంటున్నాయి!!!
  
మధ్యతరగతి ఇల్లాలి నగలు....
మార్వాడీకొట్లో
విశ్రాంతి తీసుకుంటున్నాయి!!!

----భాస్కరభట్ల

Saturday, July 9, 2011

నీటి అద్దంలో


నీటి అద్దంలో
తన అందాన్ని
చూసుకుంటోంది
చెట్టు!!!

----భాస్కరభట్ల

Saturday, July 2, 2011

పొదుపు !

పొదుపుగా
వాడుకోవాల్సింది..
నీళ్ళనే కాదు,
కన్నీళ్ళని కూడా!!!

----------భాస్కరభట్ల

Saturday, June 25, 2011

పొగమబ్బులెక్కడివీ?ఆకాశం
అదేపనిగా
ఎన్నిసిగరెట్లు కాలుస్తోందో ఏమో..
లేకపోతే
ఇన్ని పొగమబ్బులెక్కడివీ?

-----భాస్కరభట్ల

Tuesday, June 7, 2011

తనూ పసిపాపే !ఆదమరిచి.. అమాయకంగా
నిదరోతున్న
నా పిల్లల మధ్య..
తనూ ఓ పసిపాపలానే
కనిపిస్తోంది
మాఆవిడ!!!

----------భాస్కరభట్ల

Wednesday, June 1, 2011

నా పని!


నువ్వు గాలివి
నేను చెట్టుని

నువ్వేమన్నా తల ఊపడమే
నా పని!

----భాస్కరభట్ల

Wednesday, May 18, 2011

కొలువుండమంటే...

నా గుండెనే గుడిలా చేసి
నిన్ను కొలువుండమంటే...

నువ్వేమో,
ఉక్కబోస్తోందనీ
ఊపిరాడటంలేదనీ
నన్ను తిట్టుకుంటున్నావ్!!!

----భాస్కరభట్ల

Thursday, April 28, 2011

ఆ పెద్దాయన...ఆ పెద్దాయన
మనసులో ఏమీ దాచుకోడు..
అందుకేనేమో
పర్సు లో కూడా
ఏమీ దాచుకోలేకపోయాడు!

----భాస్కరభట్ల

Tuesday, April 19, 2011

రాయి కనబడితే చాలు...రాయి కనబడితే చాలు...
ఆగి మొక్కేస్తాం !
అదే రాయి
బియ్యంలో కనిపిస్తే...
శాపాలు పెట్టేస్తాం !!

----భాస్కరభట్ల

Tuesday, April 12, 2011

ఎదురుచూపుఆమె కోసం
ఎదురుచూస్తున్నాడు
అతను...!
పట్టాల మీద
పదిపైసల బిళ్లపెట్టి
రైలుబండి కోసం
ఎదురుచూస్తున్న చిన్నపిల్లాడిలా!!

------భాస్కరభట్ల

Sunday, April 3, 2011

అన్నీ ప్లాస్టిక్‌వే!!
ప్లాస్టిక్ వినియోగం
బాగా పెరిగిపోతోంది..
పువ్వులే కాదు
ఆఖరికి
నవ్వులు కూడా
ప్లాస్టిక్‌వే!!

-----భాస్కరభట్ల

Friday, March 25, 2011

స్నానం చేయిస్తోందిపనమ్మాయి..
సబ్బురుద్ది,
స్నానం చేయిస్తోంది
అంట్ల మొహాలకి!

----భాస్కరభట్ల

Saturday, March 19, 2011

ఎదిగిపోయింది ...అసెంబ్లీలో
కుర్చీలు...మైకులు
విరగ్గొట్టడం నుంచి,
టాంక్‌బండ్ మీద
విగ్రహాలు పగలగొట్టడం వరకూ..
ఆహా..
ఎంత ఎదిగిపోయింది రాజకీయం?!

-----భాస్కరభట్ల

Saturday, March 12, 2011

గర్వంగా తలెత్తుకుంది!
చినుకుతడి తగలగానే..
గడ్డిమొక్క
గర్వంగా తలెత్తుకుంది!
అచ్చం
తెలుగుభాష తలకట్టులాగ!!

-----భాస్కరభట్ల

Monday, March 7, 2011

శీతాకాలంశీతాకాలం
తెల్లవారు ఝాము
మంచు కురుస్తోంది...
అప్పుడే వాయతీసిన
వేడి వేడి ఇడ్లీలమీద పొగలా!

-----భాస్కరభట్ల

Tuesday, March 1, 2011

పట్టుకుపోయింది!వరదొచ్చింది...
చెట్టంత కొడుకునీ,
కొడుకంత చెట్టునీ
పట్టుకుపోయింది!

-----భాస్కరభట్ల

Wednesday, February 23, 2011

కోనసీమ!
గోదారమ్మ
నుదుటిమీద
ఆకుపచ్చ
బొట్టుబిళ్ళ
కోనసీమ!

-----భాస్కరభట్ల
ఫొటో:కళాధర్ బాపు

Friday, February 18, 2011

మొహం దాచేసుకుంది...పాతచీర,
మొహం దాచేసుకుంది...
బొంతలో!

----భాస్కరభట్ల

Saturday, February 12, 2011

చోటుదొరికింది..!ఒక పాదానికే
చోటుదొరికింది..!
రెండో పాదం గాల్లోనే…
ఫుట్‌బోర్డ్ ప్రయాణం!

-----భాస్కరభట్ల

Saturday, February 5, 2011

వెంటాడే జ్ఞాపకం!
ఎప్పుడో టూరింగ్‌టాకీస్ లో
చూసిన సినిమా..
ఇప్పుడు మళ్ళీ
నా హోమ్‌ధియేటర్ లో...!
ప్చ్ ...
ఒళ్ళో కూచోబెట్టుకున్న తాతయ్యేలేడు!

----భాస్కరభట్ల

Saturday, January 29, 2011

ఎంతఘోరం!విక్రమార్కుడి భుజాలమీద
భేతాళుడిలా...
బడిపిల్లాడి
భుజాలమీద
భారంగా వేలాడుతున్న
పుస్తకాల సంచీ!!

-----భాస్కరభట్ల

Monday, January 24, 2011

హు(


ఆమె ఉత్తర దిక్కు..
నేను దక్షిణదిక్కు..
అందుకేనేమో
ఎన్ని ఉత్తరాలు రాసినా
స్పందించట్లేదు!!

----భాస్కరభట్ల

Wednesday, January 19, 2011

చదువుకునే రోజుల్లో...
అందమైన అమ్మాయి కనిపించగానే
చూపులన్నీ
పాదాలమీదే!.
హమ్మయ్య..
మెట్టెల్లేవ్..
ఆమె నాదే!

-----భాస్కరభట్ల

Monday, January 17, 2011

మంచి‘ఐడియా’!సెల్ ఫోన్‌లో టాక్‌‍టైం
అయిపోగానే
రీఛార్జ్ చేయించుకునే అవకాశం ఉన్నట్టే..

జీవితంలో అప్పుడప్పుడూ దూరమైపోయే
కొంచెం ఆనందాన్నీ,
ఇంకొంచెం మనశ్శాంతినీ
రీఛార్జ్‌చేసుకునే సౌకర్యం
ఉంటే ఎంత బాగుణ్ణో!!!

------భాస్కరభట్ల

Wednesday, January 5, 2011

మీకూ అంతేనా?


ఇప్పుడంటే రెండేగానీ...
చిన్నప్పుడు నాకు మూడు కళ్లు!
పుస్తకంలో
దాచుకున్న
నెమలికన్నుతో కలిపి!!!

----భాస్కరభట్ల