Thursday, August 26, 2010

తలకిందులు!


అన్నప్రాశనలో..
పిల్లాడు... కత్తి ముట్టుకుంటే
హడలిపోయారు అందరూ
హంతకుడవుతాడని!
కానీ,
పెద్దయ్యాక
అతని ఇంటిముందు
వెలిసింది బోర్డు
మాస్టర్‌ ఆఫ్ సర్జన్ అనీ..
ఆపరేషన్ స్పెషలిష్టనీ!!!

---భాస్కరభట్ల

Saturday, July 24, 2010

చెలియా!నా వెనక వందలమంది సైనికులున్నారు,
నా చేతిలో ak-47 వుంది
అయినా ధైర్యం రావట్లేదు...!

నన్ను చూసి ప్రేమగా
ఓ నవ్వు విసిరావు చూడూ...
ఆ క్షణంలో
ధైర్యమేంటి..ఏకంగా తెగింపే వచ్చేసింది!!!
----భాస్కరభట్ల

Saturday, July 10, 2010

నిరీక్షణ!


నీకోసం
గుడిలో నిరీక్షిస్తుంటే
గుడిగోపురమెక్కి చూస్తోంది
మనస్సు!

----భాస్కరభట్ల

Friday, July 2, 2010

అర్ధంచేసుకోరూ!


నువ్వెక్కడుంటే
నేనక్కడుంటా
అన్నాడతను పొయెటిగ్గా...
మరీ అంత అనుమానమా..అని
అతని ప్రేమని
వొద్దనేసిందామె చిరాగ్గా!

----భాస్కరభట్ల

Friday, June 25, 2010

అదేంటో !


ఎలాంటి సమస్యలనైనా
ఎదిరించి బతుకుతున్న…వాడు.!
పిల్లి ఎదురొస్తే
ఎందుకో
భయపడుతున్నాడు!

----భాస్కరభట్ల

Monday, June 21, 2010

ఔను!మొక్కజొన్న కంకుల్ని
అందరూ కాల్చుకు తింటారని తెలుసు!
ఇలా..
గుండెల్ని కాల్చుకు తినేదొకటుందని
ప్రేమలో పడ్డాకే
తెలిసింది!

----భాస్కరభట్ల

Friday, June 18, 2010

నీకోసం!
కళ్లు మూసుకుపోయి
ప్రవర్తిస్తున్నానని
అందరూ నన్ను తిడుతున్నారు.
కళ్లు మూసుకుంటేనే
కల వస్తుందనీ,
ఆ కలలో నువ్వు కనిపిస్తావనీ
నేనెలా చెప్పేది?

----భాస్కరభట్ల

Wednesday, June 16, 2010

వెలితి!
రోజూలానే రెప్పల్ని విరుచుకుంటూ
నిద్ర పక్షి ఎగిరిపోతుంది...
కాఫీ కప్పును మోసుకొచ్చే
గాజుల గలగలలు మాత్రం వినబడవు!
బాత్రూంలో వేణ్ణీళ్ళు,
టిఫిన్ చేసి వెళ్ళమనే వేడుకోళ్ళు వినిపించవు!
ఫాలిష్ తో మెరిసే షూలు,
ఇస్త్రీ బట్టలు ఎదురుపడవు!
స్కూటర్‌ స్టార్ట్ చేసి..
వీధి మలుపుదగ్గర కనుమరుగయ్యే వరకూ
టాటా చెబుతూ ఏ చేతులూ గాలిలో ఆడవు!
ఏచూపులూ వెన్నంటి రావు!
ఆఫీసుతో ఎనిమిది గంటల సంసారం సాగించి
సాయంకాలవేళ ఇంటికి చేరితే
మల్లెపూలపొట్లాం కోసం గోముగా నడిచివచ్చే
పాదమంజీరధ్వనులు దరిచేరవు!
ఇంట్లో స్టవ్,గిన్నె వగైరాలు
శెలవు దొరికాయని సంబరపడతాయి!
ఎలకలు మీసాలు మెలేస్తాయి!
సంభాషణలుండవు..
సంఘర్షణలుండవు..
నిట్టూర్పులుండవు..
నిబిడాశ్చర్యాలూ వుండవు..

డబల్‌కాట్ మీద ఓ దిండు ఖాళీగా కనిపించి
మనసు నలిగిపోతుంది!
మనసులాగే ఇల్లు ఇల్లంతా వెలితే!
శ్రీమతి ఎప్పుడైనా పుట్టింటికి వెళితే!!!!!!

----భాస్కరభట్ల

Tuesday, June 8, 2010

నాతోనే ఉంటావు కదూ!


నువ్వు
నాసమక్షంలో ఉన్నప్పుడు
దండెంమీద ఆరేసిన పట్టుపంచెలా
రెపెరెపలాడిపోతుంది
మనస్సు!

కాసేపు నువ్వు కనిపించకపోతే...
చిలక్కొయ్యకి తగిలించిన చొక్కాలా
విలవిల్లాడిపోదూ?

----భాస్కరభట్ల

Thursday, June 3, 2010

అవును మరి!


నాలో నువ్వు సగం
నేను సగం అన్నావు.!
నేనిప్పుడు ఆలోచిస్తున్నది...
నాలో నువ్వులేని మిగతా సగం
నాకుమాత్రం ఎందుకని?

----భాస్కరభట్ల

Wednesday, June 2, 2010

శత్రువు!


సిగరెట్ కాల్చే అలవాటున్నందుకు
నన్ను నేనే తిట్టుకున్నాను.
అదేదో అరోగ్యానికి హానికరమని కాదు!
నీ ధ్యాసలోపడి
మైమరచిపోతుంటే...
నా ఆలోచనల్ని చెడగొట్టిందీ..
విలన్‌లా అడ్డుపడిందీ..
చేతివేళ్లమధ్య చుర్రుమన్న
ఆ సిగరెట్టే!

----భాస్కరభట్ల

బలుపు!!


అతగాడికి ఈమధ్య
మతిమరుపు మరీ ఎక్కువైనట్టుంది...
కనిపించిన వాళ్ళనే కాదు
కని-పెంచిన వాళ్ళనికూడా
మరిచిపోతున్నాడు!

----భాస్కరభట్ల

Monday, May 31, 2010

నిజం కదా!


పట్నం వాళ్ళది
నాగరికత!
పల్లెటూరి వాళ్లది
‘నాగలి’కత

----భాస్కరభట్ల

ప్చ్!


ఇప్పుడసలు
గుండెలు చెమ్మగిల్లడమే లేదు!
వర్షం వచ్చినప్పుడు
గోడలు తప్ప!

---- భాస్కరభట్ల

ఇష్టారాజ్యం!


చిన్నప్పుడోసారి..
మానాన్న కళ్ళద్దాలు పగలగొట్టేశా..
చెంపఛెళ్ళుమనిపించాడు.!

ఇప్పుడేనయం..
ఎంచగ్గా బస్సుఅద్దాలు పగలగొట్టినా
అడిగేవాడే లేడు!

----భాస్కరభట్ల

గుర్తుకొస్తున్నాయితప్పిపోయిందనుకున్న బాల్యాన్ని
మా అమ్మ పాత ట్రంకుపెట్టె అడుగున
నా చిన్నప్పటి ఫోటోలో
మళ్ళీ చూసుకుంటున్నాను!!!


----భాస్కరభట్ల

అమ్మ!


ఇంటిల్లిపాదికీ
చాకిరీచేసి అలసిపోతున్న
మా అమ్మని చూసి
నుదుటిమీది కుంకుమబొట్టు
బొట్లు బొట్లుగా ఏడుస్తోంది!

----భాస్కరభట్ల

ఛ!!!


మనం ఎప్పుడూ
ఎదురీదాలనుకోం..
ఏటికి ఎదురీదిన ఇలసని కూడా
పులస అంటూ
పులుసు పెట్టేసుకుంటాం!

---భాస్కరభట్ల